Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రణీత్‌రావు డీఎస్పీ హోదా రద్దు* *ఇన్‌స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు* ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న దుగ్యాల ప్రణీత్‌రావు డీఎస్పీ హోదాను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆయనను తిరిగి ఇన్‌స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్ కాలంలోనే విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.వి. ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రణీత్‌రావుకు గతంలో కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి పూర్తిగా రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్‌స్పెక్టర్ హోదాలోనే కొనసాగనున్నారు. సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది. అయితే అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా ప్రణీత్‌రావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2007 ఎస్సై బ్యాచ్‌కు చెందిన సుమారు 300 మంది అధికారుల్లో ఒక్క ప్రణీత్‌రావుకే డీఎస్పీ పదోన్నతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కార్యకలాపాలకే బహుమతిగా ఆయనను పదోన్నతి చేశారనే ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ప్రణీత్‌రావు 2016 అక్టోబర్ 24న ఎస్సై హోదాలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ)కు బదిలీ అయ్యారు. 2023 డిసెంబర్ 13 వరకు అక్కడ పనిచేశారు. ఈ కాలంలోనే ఇన్‌స్పెక్టర్‌గా, ఆపై యాక్సిలరేటెడ్ విధానంలో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఎస్‌ఐబీలో ఆయన నేతృత్వంలోనే స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ (ఎస్‌వోటీ) యూనిట్ ఏర్పాటు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు డిసెంబర్ 4న ఎస్‌ఐబీ భవనంలోని సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, ఎస్‌వోటీ లాగర్ రూమ్‌లోని ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో ఉన్న 42 హార్డ్‌డిస్క్‌లు మరియు కీలక డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్‌రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఇది టీఎస్‌సీఎస్ (కాండక్ట్) రూల్స్–1964లోని రూల్ నంబర్ 3కు స్పష్టమైన ఉల్లంఘనగా గుర్తించిన ఎస్‌ఐబీ అప్పటి డీఐజీ సూచనల మేరకు, ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీపీ 2024 జనవరి 17న ప్రభుత్వానికి సస్పెన్షన్ సిఫారసు చేశారు. దాని ఆధారంగా 2024 మార్చి 2న ప్రణీత్‌రావును సస్పెండ్ చేశారు. మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. 12న అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన పదోన్నతిని రద్దు చేయాలని డీజీపీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ‘2023 మార్చి 31న డీఎస్పీగా యాక్సిలరేటెడ్ పదోన్నతి పొందిన ప్రణీత్‌రావు, ఏడాది కూడా గడవకుండానే అధికార దుర్వినియోగానికి పాల్పడి సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించారు’ అని నివేదికలో స్పష్టం చేశారు. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం డీఎస్పీ పోస్టును రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది.
Admin
Mana Mahati News